Rajasthan Assembly Elections 2023 Voting Starts: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023కి సర్వం సిద్ధమైంది. నేడు (నవంబర్ 25) అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ఆరంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాజస్థాన్‌లో మొత్తం 199 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.
రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఒక్క స్థానానికి పోలింగ్ జరగడం లేదు. కరణ్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మిత్ సింగ్ కున్నూర్ మరణించడంతో.. అక్కడ ఎన్నిక వాయిదా పడింది. నేడు జరిగే 199 స్థానాలకు 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5,25,38,105గా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 36,101 పోలింగ్ స్టేషన్లలో 51,507 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం 2,74, 846 మంది సిబ్బంది పని చేస్తుండగా.. లక్ష 70 వేల మంది బందోబస్తు కాస్తున్నారు.
Also Read: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు వెండి ధర ఎంతంటే?
ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గత కొన్ని రోజులుగా నువ్వానేనా అన్నట్టు ప్రచారం చేశాయి. పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఐదేళ్లకోసారి మరో పార్టీకి పగ్గాలు ఇవ్వడమనే సంప్రదాయం.. ఈసారి తమకు అనుకూలిస్తుందని బీజేపీ భావిస్తోంది. మరి చూడాలి జనాలు ఏం చేస్తారో. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.