Raj Gopal Reddy vs Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచించారు. మరో మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డే సీఎం అని, ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దామన్నారు. తనకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందని మరోసారి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలి. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటుంన్నారు. నాకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసింది. నా మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియదు. ఇంకా మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది’ అని చెప్పారు.
Also Read: Raksha Bandhan 2025: రాఖీ కట్టేందుకు నియమాలు.. ఏ దిక్కున కూర్చోవాలి, ఎన్ని ముడులు శుభప్రదమో తెలుసా?
‘సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు ఉంది సీఎం రేవంత్ రెడ్డి వైఖరి. నాకు మంత్రి పదవే కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో బీఆర్ఎస్ ఉంది. అసెంబ్లీకి రాని కేసీఆర్.. ముందుగా తన ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాలేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులపై మండిపడ్డారు. ఆ విషయంలోనే ఇప్పటికే ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన మునుగోడు ఎమ్మెల్యే.. తాజాగా మరోసారి టార్గెట్ చేశారు.