రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది.. ఈదురు గాలులతో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని.. రైతులతో పాటు సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పిడుగులు సైతం పడే అవకాశం ఉంది. అందుకే వర్షం వచ్చే సమయంలో చెట్ల కింద ఉండకూడదు.
READ MORE: Pawan Kalyan : ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. పవన్ డైలాగ్ తో ఏస్ ట్రైలర్..
కాగా.. నేడు హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి హాట్ హాట్ గా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. హిమాయత్ నగర్, బషీర్ బాగ్, మియాపూర్ లో మోస్తరు వానలు కురవగా.. చందానగర్, గచ్చిబౌలిలో దంచికొట్టింది. ఇవాళ్టి నుంచి మరో మూడు రోజుల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. మరోవైపు .. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచే దక్షిణ తెలంగాణ అంతటా ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గద్వాల్ జిల్లా రాజోలి మండలం మందొడ్డిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి.