తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదుల్లో వరద పోటెత్తుతుంది. ఈ క్రమంలో కాళేశ్వరం, భద్రాచలం వద్ద గోదావరి నదికి ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోయి రవాణా స్తంభించి పోయింది. రాగల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఇటు.. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షం పడుతుందని తెలిపింది.
Tungabhadra Dam: తుంగభద్రకు పోటెత్తిన భారీ వరద.. గేట్లు ఎత్తివేత
ఈ క్రమంలో.. అధికారులతో సీఎస్ శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్న క్రమంలో.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాల్లో ఏ విధమైన ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ముందుగానే పునరావాస కేంద్రాల ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని.. పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, NDRF, SDRF తదితర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు.
Delhi: మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల పలు చెరువులు, కుంటలు నిండాయని.. అవి తెగకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని సీఎస్ కోరారు. క్షేత్రస్థాయి అధికారులంతా తమ తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉండి పరిస్థితికనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని, వీలైనంత వేగంగా స్పందించాలన్నారు. భద్రాచలం వద్ద ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను ప్రకటించామని.. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లాల్లో దెబ్బతిన్న నివాస గృహాలు, ఇతర నష్టాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఏ విధమైన అనుకోని సంఘటలు ఎదురైతే, ఎదుర్కోవడానికి NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు. అన్ని మండలాలలో మండలాల వారీగా అధికారుల బృందాలను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నామని ములుగు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతీ గ్రామంలో ప్రత్యేకంగా ఒక సమాచార అధికారిని గుర్తించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. దాదాపు వంద కిలోమీటర్ల విస్తీర్ణంలో ములుగు జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతం ఉందని, 77 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి ముందస్తు జాగ్రత్తలను చేపట్టామని కలెక్టర్ తెలిపారు.