ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతకు ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు దీంతో కొంత ఉపశమనం లభించింది. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ధాన్యం తడిసిముద్దయింది. మానుకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభకోసం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. ఆ సమయంలో టెంట్ల కింద కార్యకర్తలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ములుగు జిల్లాలో కూడా పలుచోట్ల వర్షం కురిసింది. వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. నిన్నమొన్నటిదాకా 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా దిగొచ్చాయి. ఆయా జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల మాత్రమే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే.. మిగతా చోట్ల 44 లోపే రికార్డ్ అయ్యాయి. అయితే నార్త్‌లో మాత్రం హీట్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కోల్‌బెల్ట్ జిల్లాల్లో టెంపరేచర్లు 46 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి.