Congress Manifesto: లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పూరించింది. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు హస్తం పార్టీ సమరశంఖం పూరించింది. తుక్కుగూడలో జరుగుతున్న కాంగ్రెస్ ‘జనజాతర’ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘న్యాయపత్రం’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 5 గ్యారెంటీల పత్రాన్ని కూడా ఆయన విడుదల చేశారు. కొన్ని రోజుల కిందే తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టోను ఇక్కడ రిలీజ్ చేశానని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లే.. జాతీయ స్థాయిలో కూడా మాటలు నిలబెట్టుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
ఐదు న్యాయసూత్రాల్లో… యువతకు శిక్షణ, మహిళల కోసం నారీ న్యాయ్, రైతుల కోసం కిసాన్ న్యాయ్, కార్మిక్ న్యాయ్, తొంబై శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమన్యాయం అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి సంబంధించిన గ్యారెంటీల మేనిఫెస్టోను విడుదల చేశామని, ఇప్పుడు జాతీయ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడి నుంచే ఆరు గ్యారెంటీలు ఇచ్చి… వాటిని అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఏ గ్యారెంటీని లేదా ఏ హామీని అయితే ఇచ్చామో… ఆ మాట నిలబెట్టుకున్నట్లుగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసునన్నారు. తెలంగాణలో హామీలను నెరవేర్చినట్లు, జాతీయస్థాయిలో కూడా నిలబెట్టుకుంటామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ హామీలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ గొంతు అనుకోవద్దని… ఇది యావత్ భారత దేశం యొక్క గొంతు అన్నారు. మేనిఫెస్టోలోను ఐదు న్యాయసూత్రాలు ఐదు భారతీయ ఆత్మలు అన్నారు.