Rahul Dravid React on Team India’s Six-Hitting vs England: శనివారం ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 4-1 తేడాతో రోహిత్ సేన కైవసం చేసుకుంది. భారత జట్టు తమ స్వదేశీ రికార్డును నిలబెట్టుకోవడంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశారు. అలానే ఈ సిరీస్‌లో భారత ప్లేయర్స్ బాగా సిక్సులు బాదారని ప్రశంసించారు. సిక్సర్లు బాదడంలో రోహిత్ శర్మ లాంటి హిట్టర్ మరొకరు లేరని ద్రవిడ్ పేర్కొన్నారు.
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు కలిపి 102 సిక్సర్లు బాదాయి. ఇందులో భారత్ 72 పరుగులు సిక్సర్లు బాదితే.. ఇంగ్లండ్ 30 కొట్టారు. అంటే ఇంగ్లండ్ కంటే డబుల్ సిక్సర్లు టీమిండియా ప్లేయర్స్ కొట్టారు. దీనిపై మ్యాచ్ అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ‘మా ఆటగాళ్లకు నా వీడియోలు చూపించాను. అందుకే అలా సిక్సర్లు బాదుతున్నారు. జోక్స్ పక్కన పెడితే.. టెస్ట్ ఫార్మాట్లో ఏ ఆటగాడైనా సిక్స్‌లు కొడుతుంటే చాలా బాగుంటుంది’ అని ద్రవిడ్ చెప్పారు.
‘భారత ఆటగాళ్లు వేరే స్థాయిలో ఆడారు. రోహిత్ శర్మ లాంటి గొప్ప సిక్స్ హిట్టర్ టీమిండియాకు ఉన్నాడు. షాట్ బాదడంలో తన పవర్, నైపుణ్యం అద్భుతం. బంతిని కొట్టిన ప్రతిసారీ అది ఔట్ అయినట్లు అనిపిస్తుంది. ఇది అద్భుతంగా ఉంటుంది. మొదటి టెస్టులో ఓడి వెనుకబడిపోవడం నిరాశపరిచింది. కానీ తిరిగి పుంజుకోవడం చాలా గొప్ప విషయం. మేం కొంతమంది కీలక ఆటగాళ్లను కోల్పోయాము. అయినా యువకులతో టెస్ట్ సిరీస్ గెలిచాం. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉందని మేము నమ్ముతున్నాము. యువకులు బాగా రాణించడాన్ని చూడటం అద్భుతంగా ఉంది. ఒక మంచి బృందంతో కలిసి పని చేసే అవకాశం నాకు దక్కింది. రోహిత్ శర్మతో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను అద్భుతమైన నాయకుడు’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు.