AR Rahaman : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కి మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ లో రెహమాన్‌కి పురస్కారం లభించింది. ‘ది గోట్ లైఫ్’ సినిమాకు ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందజేసినందుకు గానూ రెహమాన్ కు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ అవార్డు వేడుకలో రెహమాన్ పాల్గొనలేదు. దీంతో ఆయన తరపున ది గోట్ లైఫ్ సినిమా దర్శకుడు బ్లెస్సీ ఆ అవార్డు అందుకున్నారు. విదేశీ భాషా చిత్రం విభాగంలో ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్‌కి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్ ప్రముఖ నటీనటులు నటించిన ఈ సినిమాకి బ్లెస్సీ దర్శకత్వం వహించగా తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ భారీగా బరువు తగ్గడంతో పాటు, ఏడారిలోని సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. చాలా నేచురల్‌గా ఉన్న సన్నివేశాలకు సంగీత దర్శకుడు రెహమాన్ ఇచ్చిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా విడుదల సమయంలో రెహమాన్ నేపథ్య సంగీతానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న రెహమాన్ ఇప్పుడు ఈ అంతర్జాతీయ అవార్డును సైతం అందుకోవడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రెహమాన్‌పై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. రెహమాన్ గత కొన్ని రోజులుగా విడాకుల వార్తలతో మీడియాలో ఉంటున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో ఆయనకు ఇలాంటి అరుదైన అవార్డు రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన తన సుదీర్ఘ వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డు రావడం ఆయనకు కాస్త ఊరట కలిగించే విషయంగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ది గోట్ లైఫ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అవార్డు రావడం పట్ల రెహమాన్ స్పందిస్తూ సినిమాను చాలా నేచురల్‌గా రూపొందించిన దర్శకుడు బ్లెస్సీకి అభినందనలు తెలిపారు. అంతే కాకుండా ఈ అవార్డును ఇచ్చిన జ్యూరీ మెంబర్స్‌కి రెహమాన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం రెహమాన్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also:Telangana CMO: మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం.. దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్..