అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీన మల్లిఖార్జున ఖర్గే, షర్మిల, మాణిక్యం ఠాగూర్ లతో కలిసి జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని అన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ పార్టీలు నాశనం చేశాయని దుయ్యబట్టారు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదాలాంటి అంశాలు తమ మేనిఫెస్టోలో ఉంటాయని తెలిపారు. కాగా.. ఇండియా కూటమితో కలిసి వచ్చే అందరితో మాట్లాడతామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యల పై రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖూనీలు చేసే వారు కూడా తమ గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. బీజేపీ తమ పార్టీ ఖాతాలు ఫ్రీజ్ చేయడం చూస్తే.. మమ్మలని చూస్తే ఎంత భయంగా ఉందో అర్థం అవుతుందని ఆరోపించారు.
Read Also: Balineni Srinivasa Reddy: పేద ప్రజలను అన్యాయం చేయాలని చూస్తే సహించం..
మరోవైపు.. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ.. 2024లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెఢీగా ఉందని అన్నారు. విశాఖపట్నంలో జరిగే ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. అంతేకాకుండా.. ఎన్నికల ప్రచార సభలలో ప్రియంకా గాంధీ, కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా పాల్గొంటారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. జగన్ ఏపీ ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. మా అజెండా చాలా క్లియర్ గా ఉంది.. రాబోయే ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.