Gachibowli Radisson Hotel Drugs Case Updates: హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న నటి లిషి, సందీప్‌లు ఆదివారం రాతి గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఇద్దరి నుంచి యూరిన్, బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆ శాంపిల్స్‌ని పంపారు. ఫోరెన్సిక్ ఫలితాల కోసం గచ్చిబౌలి పోలీసులు ఎదురుచూస్తున్నారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు నీల్ పరారీలో ఉన్నాడు. అతడు అమెరికా పారిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేయగానే.. రాత్రికి రాత్రే అమెరికాకు చెక్కేశాడట. దాంతో నీల్‌పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. నిందుతుడు కేదార్‌పై కూడా నోటీసులు లుక్ ఔట్ జారీ చేశారు. గచ్చిబౌలి పోలీసుల ముందు ఇప్పటికే హాజరైన కేదార్.. బెయిల్‌పై బయటకు వచ్చాడు. కేదార్ దేశం వదిలి వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇదే కేసులో పరారీలో ఉన్న శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్వేతకు కూడా నోటీసులు ఇచ్చారు.
ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీ జరిగిందన్న సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడిలో మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ వివేకానందతో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తంగా 10 మందిని నిందితులుగా చేర్చారు. లిషి, సందీప్, శ్వేత, నీల్, కేదార్‌లతో పాటు డైరెక్టర్ క్రిష్ పేరును కూడా పోలీసులు చేర్చారు. డ్రగ్ కేసులో నిందితులుగా ఉన్న లిషి, సందీప్, శ్వేతలు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఆదివారం లిషి, సందీప్‌లు గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Also Read: IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
వివేకానంద ఆదేశాలతో డ్రైవర్ ప్రవీణ్‌కు పెడ్లర్ మీర్జా వాహిద్ డ్రగ్స్ అందజేశాడు. స్నాప్‌చాట్ యాప్ ద్వారా చాట్ చేస్తూ.. అతడు డ్రగ్స్‌ను డెలివరీ చేశారు. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి నెలలోనే పది సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 24వ తేదీన జరిగిన డ్రగ్స్ పార్టీలో 10 మంది నిందితులు ఉన్నారని, వారందరికీ మీర్జానే కొకైన్ అందజేసినట్లుగా పోలీసులు గుర్తించారు.