Martial Law: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుగాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలలో యుద్ధ చట్టాన్ని ప్రవేశపెట్టారు, వీటిని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రష్యా ఆధ్వర్యంలోని ఈ నాలుగు ప్రాంతాల్లో మార్షల్ లాను ప్రవేశపెట్టడానికి తాను డిక్రీపై సంతకం చేసినట్లు టెలివిజన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. గురువారం ప్రారంభం నుంచి మార్షల్ లా ప్రవేశపెట్టబడుతుందని క్రెమ్లిన్ ప్రచురించింది. నెలల తరబడి మాస్కో ఆధీనంలో ఉన్న భూభాగంలో ఉక్రేనియన్ దళాలు ముందుకు సాగడంతో వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన వెలువడింది.
ఉక్రెయిన్ సర్కారు ప్రజల ఇష్టాన్ని గుర్తించడానికి నిరాకరించినట్లు, చర్చల కోసం చేసిన ప్రతిపాదనలను తిరస్కరించినట్లు ఆయన ఆరోపించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, పౌరులు చనిపోతున్నారని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ తీవ్రవాద పద్ధతులను ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ తమ భూభాగంలోకి విధ్వంసక సమూహాలను పంపుతోందని ఆయన చెప్పారు. వారు క్రిమియా వంతెనను కూడా కూల్చేశారని ఆయన విమర్శించారు. రష్యన్ చట్టం ప్రకారం.. మార్షల్ లా సైన్యాన్ని బలోపేతం చేయడానికి, కర్ఫ్యూలు, కదలిక పరిమితులు, సెన్సార్‌షిప్‌లు విధించేందుకు అనుమతిస్తుంది. రష్యా భద్రతను నిర్ధారించడానికి, భవిష్యత్‌ను రక్షించడానికి తాము చాలా క్లిష్టమైన భారీ-స్థాయి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
King Charles: ప్రిన్స్ మీ వయసెంత?.. కింగ్ చార్లెస్‌ను ప్రశ్నించిన చిన్నారి.. వీడియో వైరల్
మార్షల్ లా అనేది ఏ దేశంలోనైనా విధించబడుతుంది. దీనిని సైనిక చట్టం అని కూడా అంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో, సైన్యం ఏదైనా దేశంలోని న్యాయ వ్యవస్థను స్వాధీనం చేసుకున్నప్పుడు, అప్పుడు ప్రభావవంతంగా ఉండే నియమాలను మార్షల్ లా అంటారు. కొన్నిసార్లు ఈ చట్టం యుద్ధం సమయంలో లేదా ఒక ప్రాంతాన్ని గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో విధించబడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది జర్మనీ, జపాన్‌లలో అమలు చేయబడింది.ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో కూడా నాలుగు సార్లు మార్షల్ లా విధించబడింది. పౌర నిర్బంధం లేదా ఏదైనా జాతీయ మార్గాలు వచ్చినప్పుడు లేదా యుద్ధ స్థితి మొదలైనప్పుడు మాత్రమే ఒక దేశం సైనిక చట్టాన్ని అమలు చేస్తుంది. అప్పుడు ఆ ప్రాంతం సైన్యం చేతుల్లోకి వెళ్తుంది. సైనిక చట్టం దేశం మొత్తానికి వర్తింపజేయాల్సిన అవసరం లేదు. దేశంలోని ఏ చిన్న ప్రాంతంలోనైనా విధించవచ్చు. మార్షల్ లా విధించాక సాధారణ పౌర వ్యవస్థ తొలగించబడుతుంది. తిరుగుబాటు తర్వాత కూడా మార్షల్ లా విధించబడుతుంది.