MLA Rachamallu Siva Prasad Reddy: ప్రొద్దుటూరులో పోలీసు అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.. ఇదే సమయంలో.. ఆయన ఉపయోగించిన పదజాలంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.. దీంతో.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే.. ఈ రోజు ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. అమ్మ మొగుడు.. అనే పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు. నా మాటలు ఎస్పీకి బాధ కలిగించింది ఉంటే క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఇది కడప జిల్లా పదజాలం.. కానీ, బాధ్యత గల వ్యక్తిగా నేను అలా మాట్లాడరాదు అన్నారు. ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ కార్యాలయానికి నేను వెళ్లి ప్రజలకు వున్న సమస్యని వివరించాను. చట్టాన్ని సవరణ చేయాలని డిమాండ్ చేశాను అన్నారు.
ఇక, కుటుంబ అవసరాలకు మందు తీసుకొని వెళ్తుంటే కేసులు నమోదు చేయటం ఏంటి..? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాచమల్లు.. కర్మ కార్యక్రమానికి మందు తీసుకెళ్తుంటే అరెస్టు చేసి కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కేసులు టార్గెట్ ఉంది.. అన్నందుకే సెబ్ ఎస్పీని అమ్మమొగుడుకు చెప్పు అని అన్నాను అన్నారు. 3 బాటిళ్ల కన్నా ఎక్కువ వుంటే కేసులు నమోదు చేసే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కాగా, ఎమ్మెల్యే పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.. పుల్లయ్య అనే వ్యక్తి.. 30 మద్యం బాటిళ్లను తీసుకెళ్తూ ఎస్ఈబీ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో నేరుగా ఎస్‌ఈబీ కార్యాలయానికి వెళ్లారు.. ఎందుకు అరెస్ట్ చేశారంటూ పోలీసులపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులను సైతం దుర్భాషలాడినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం విదితమే.