కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. సోమవారమే ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినధ్యం వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్దా పదవీకాలం త్వరలోనే ముగుస్తుంది. ఈ స్థానం నుంచి ప్రియాంకా గాంధీని ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిభాసింగ్ స్పష్టం చేశారు.
ఈ విషయంపై త్వరలోనే సోనియా, ప్రియాంకతో చర్చిస్తామని ప్రతిభాసింగ్ వెల్లడించారు. వీళ్లిద్దరిలో ఎవరు ఆసక్తి చూపించినా ఒకర్ని రాజ్యసభకు పంపిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రియాంక మాత్రం ఇప్పటి వరకూ ఏ సభలోనూ ప్రాతినిధ్యం వహించలేదు. కేవలం ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల తరపున మాత్రమే ప్రియాంక ప్రచారం నిర్వహిస్తున్నారు. పైగా త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకకు ఏదొక పదవి ఉంటే బాగుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
AP Govt: ఏపీ సర్కార్ ముందడుగు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్..
2018లో హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ రాష్ట్రం నుంచి జేపీ నడ్డా రాజ్యసభకు వెళ్లారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ నెలతో పూర్తవుతుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 68 స్థానాలకు గానూ 40 సీట్లను దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఆ స్థానం హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిభాసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ కూడా ఇదే ప్రతిపాదనను సోనియా, ప్రియాంకల ముందు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లేదా నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని తెలంగాణ పీసీసీ కోరుతుంది. తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. కానీ ఇప్పటి వరకూ సమాధానం లేదు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఇదే ప్రతిపాదన పెట్టింది. సోనియా, ప్రియాంక ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.