వెర్సటైల్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ మూవీలో చేస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ లో బాల సుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో హీరోయిన్ ఎంపిక కూడా ఇప్పుడు జరిగింది. కోలీవుడ్ భామ ప్రియా భవానీ శంకర్ ను ఒక హీరోయిన్ గా ఇందులో సెలక్ట్ చేశారు. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. పలు తమిళ చిత్రాలతో పాటు ఇటీవలి విడుదలైన ధనుష్ ‘తిరు’లో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. ఆమెకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్‌పై ఉన్న వస్తువులను పరిశీలిస్తే కుట్టు కొలిచే టేప్, కట్టర్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రియా ఫ్యాషన్ డిజైనర్‌గా నటిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా వుండబోతోంది.
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న సత్యదేవ్, డాలీ ధనుంజయ్ ఇద్దరికీ ఇది 26వ చిత్రం కావడం విశేషం.