Site icon NTV Telugu

Rajasthan: పోలీసు కస్టడీలో ఖైదీ మృతి.. 8 మంది పోలీసులపై కేసు నమోదు

Police Custody

Police Custody

రాజస్థాన్లోని జుంజును జిల్లాలో ఓ అత్యాచార నిందితుడు పోలీసుల కస్టడీలో మృతిచెందాడు. ఈ క్రమంలో.. ఎస్‌హెచ్‌ఓ సహా ఎనిమిది మంది పోలీసులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మే 29న మాండ్రేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యాచారం కేసులో కోట్‌పుట్లీకి చెందిన గౌరవ్ శర్మ (30) అనే నిందితుడిని జైపూర్‌లో మే 24న అరెస్టు చేశారు. కాగా.. మరుసటి రోజు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్ట్ నిందితుడికి ఐదు రోజుల రిమాండ్‌పై పోలీసులకు అప్పగించింది.

ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎంతో తెలుసా?

మే 29న నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తుండగా అతని ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై నిందితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టడీలో తీవ్రంగా కొట్టి చంపారని ఆరోపించారు. ఈ క్రమంలో.. ఎస్‌హెచ్‌ఓ, ఇతర పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.

Votes Counted: లోక్‌సభ ఎన్నికల ఓట్లు ఎలా లెక్కిస్తారు..?

కాగా.. ఆదివారం అర్థరాత్రి కుటుంబ సభ్యులతో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై నచ్చజెప్పారు. ఎస్‌హెచ్‌ఓ రవీంద్ర కుమార్‌తో సహా ఎనిమిది మంది పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేశామని, ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేసినట్లు ఏఎస్పీ రాథోడ్ తెలిపారు. దీంతో.. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version