అరబ్ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోర్డాన్‌కు చేరుకున్నారు. జోర్డాన్‌లోని అమ్మాన్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ రాజు II అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్, ప్రధాని జాఫర్‌తో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు.
ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ” నేను అమ్మాన్ చేరుకున్నాను. విమానాశ్రయంలో నాకు లభించిన ఆత్మీయ స్వాగతం కోసం జోర్డాన్ హాషెమైట్ రాజ్యం ప్రధాన మంత్రి జాఫర్ హసన్ కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ పర్యటన మన దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంచుతుందని నేను విశ్వసిస్తున్నాను ” అని రాసుకొచ్చారు. ముఖ్యంగా ప్రధాని మోడీ పర్యటన భారత్- జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి కావడానికి గుర్తుగా నిలుస్తుంది. జోర్డాన్ అనేది ప్రధాని మోడీ నాలుగు రోజుల, మూడు దేశాల పర్యటనలో మొదటి దశ. ఆ తర్వాత ఇథియోపియా, ఒమన్‌ల్ లలో పర్యటించనున్నారు.