Prashant Kishor: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఆ తర్వాత చంద్రబాబును ఎందుకు కలిశాను అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తూ వస్తోంది పీకే టీమ్.. ఈ రోజు ఉన్నట్టుండి లోకేష్ వెంట వచ్చి చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరపడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పీకే టీమ్ పనిచేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారగా.. ఈ భేటీ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం అయిన పీకే.. మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశానని చెప్పుకొచ్చారు.
Read Also:Chandrababu and Prashant Kishor Meet: ఆ ముగ్గురి మధ్య 3 గంటల పాటు కీలక చర్చలు..!
చంద్రబాబుతో సమావేశం ముగిసిన తర్వాత లోకేష్‌తో కలిసి తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ప్రశాంత్ కిషోర్‌ను ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించింది.. అయితే, తాను మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశాను అని తెలిపారు.. చంద్రబాబు సీనియర్ నాయకుడు.. అందుకే చంద్రబాబు దగ్గరకు వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు పీకే.. అయితే, ఇప్పటి వరకు సీఎం వైఎస్ జగన్‌తో పాటు ప్రశాంత్ కిషోర్‌ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పుడు పీకేనే సంప్రదించడం ఏంటి? ఆయన వ్యూహాలతోనే వచ్చే ఎన్నికల్లో ముందుకు నడుస్తుందా? లేదా? యథావిథిగా పీకే.. వైసీపీ తరఫునే పనిచేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
అయితే, ఎజెండా ఏమిటో స్పష్టంగా తెలియక ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది చంద్రబాబు, పీకే మీటింగ్.. ఇదిలా ఉండగా, నాయుడు, లోకేష్, కిషోర్‌ల మధ్య రాజకీయ బంధాన్ని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎగతాళి చేశారు.(బిల్డింగ్) మెటీరియల్ లోపభూయిష్టంగా ఉన్నప్పుడు తాపీ మేస్త్రీ ఏమి చేయగలడు?” అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇక, 2019 అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికలకు ముందు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకున్నారు.. చివరికి ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాధించింది. అయితే, అప్పట్లో రెడ్డితో జతకట్టినందుకు కిషోర్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, కానీ, ఇప్పుడు మాత్రం మరో మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.