సుమారు నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని భాషల్లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. కేవలం నటుడిగానే కాకుండా సమాజంలో జరిగే పరిణామాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన, తాజాగా హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్) తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న ప్రకాష్ రాజ్, బాలీవుడ్ ప్రస్తుతం తన మూలాలను కోల్పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : Simbu : తమిళంలో ఆ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం హిందీ సినిమాలు చూడటానికి పైకి చాలా అద్భుతంగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం ఆత్మ లేని ‘డొల్ల’ అని వ్యాకర్యనించాడు. బాలీవుడ్ తీరు ప్రస్తుతం ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలోని ప్లాస్టిక్ విగ్రహాల మాదిరిగా తయారైందని ఆయన కామెంట్ చేశారు. అంటే, చూడటానికి అందంగా ఉన్నా వాటిలో జీవం లేదని ఆయన అంతరార్థం. మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగాక బాలీవుడ్ కేవలం లగ్జరీ లుక్స్, ప్రమోషన్లు, భారీ ఖర్చుతో కూడిన రీల్స్ , కేవలం డబ్బు చుట్టూనే తిరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆయన ఆకాశానికెత్తారు..
ముఖ్యంగా తమిళ, మలయాళ దర్శకులు మట్టి కథలను, సమాజంలోని అట్టడుగు వర్గాల సమస్యలను దళితుల వేదనను ఎంతో సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారని కొనియాడారు. ‘మన వేర్లు మన కథల్లో ఉండాలి. ప్రాంతీయతను పక్కన పెట్టి కేవలం గ్లామర్ వెంటే పరిగెత్తడం వల్లే హిందీ సినిమాలు సామాన్య ప్రేక్షకులకు దూరమవుతున్నాయి’ అని ఆయన విశ్లేషించారు. దక్షిణాదిలో వస్తున్న ‘జై భీమ్’, ‘మామన్నన్’ వంటి చిత్రాలు సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తుంటే, బాలీవుడ్ మాత్రం కేవలం కమర్షియల్ హంగులకే పరిమితమైందని ఆయన విమర్శించారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఈ ‘ప్లాస్టిక్ మ్యూజియం’ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా, ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.