నిజామాబాద్ (ఇందూరు) జిల్లాలోని నర్సింగ్ పల్లిలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన వేంకటేశ్వర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లోని పలువురు రైతులు ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయాన్ని కొంతకాలంగా చేస్తున్నారు. ‘మా పల్లె’ పేరుతో ఓ సంస్థను స్థాపించి, వారందరినీ ఏకీకృతం చేసి ‘దిల్’ రాజు సోదరుడు నరసింహా రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించడంతో పాటుగా ప్రజలకు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ప్రధమ కర్తవ్యంగా ‘మా పల్లె’ సంస్థ కృషి చేస్తోంది. నర్సింగ్ పల్లి లోని తిరుమల ఆలయం కేంద్రంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని తెలియచేసే ‘మా పల్లె’ వెబ్ సైట్ ను ఆదివారం దేవాలయ ప్రాంగణంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, ”ఈ ప్రపంచంలో ప్రకృతిని నాశనం చేయడంలో మనిషిని మించిన మరో జీవి లేదు. కేవలం తన కోసమే కాకుండా తన తర్వాత తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకృతిని సర్వనాశనం చేయడానికి మనిషి వెనుకాడటంలేదు. ఈ సమయంలో ఆధ్యాత్మిక భావనతో భూమిని తల్లిగా భావిస్తూ, ప్రకృతిని కాపాడే ఇలాంటి సంస్థల అవసరం ఎంతైనా ఉంది. రైతులు కూలీలుగా మారుతున్న ఈ దుర్బర పరిస్థితుల్లో వారిలో చైతన్యం తీసుకొచ్చి, ముందుకు నడిపిస్తున్న నరసింహారెడ్డి గారి సంకల్పం గొప్పది. నా వంతుగా ఏ సహాయం కావాలన్నా ఇక్కడి రైతులకు చేస్తాను” అని హామీ ఇచ్చారు. ‘సుభాష్ పాలేకర్ గారి నేతృత్వంలో ఎంతోకాలంగా ప్రకృతి వ్యవసాయాన్ని తాము చేస్తున్నామని, అయితే ప్రకాశ్ రాజ్ లాంటి వ్యక్తి దీనికి ప్రచారం చేస్తే మరింతగా అది ప్రజలలోకి వెళుతుంద’ని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ ఉద్యమ కారులు విజయ రామ్ అన్నారు.
‘మనిషిలో ఆధ్యాత్మిక భావాలను పెంచే దేవాలయం, దాని అనుబంధంగా చక్కని ఆరోగ్యాన్ని అందించే ప్రకృతి వ్యవసాయం, సమాజం పట్ల బాధ్యతను తెలియచేసే విలువలతో కూడిన ఆలోచనధార లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని, ప్రకాశ్ రాజ్ ను ఓ నటుడిగా అభిమానించడంతో పాటు దానిని మించి ఓ మానవీయ మూర్తిగా తాను గౌరవిస్తానని, ఈ వెబ్ సైట్ ఆయన చేతుల మీద ప్రారంభం కావడం ఆనందంగా ఉంద’ని నరసింహారెడ్డి అన్నారు. తన మాటను మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రకాశ్ రాజ్ కు ‘దిల్’ రాజు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ముందు స్థానిక రైతులతో ప్రకాశ్ రాజ్, విజయ రామ్ ముచ్చటించారు. దేవాలయం సమీపంలోని ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని దిల్ రాజుతో కలిసి ప్రకాశ్ రాజ్ సందర్శించారు. అక్కడి వరి పంటలలోని రకాలను గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు.