Prakash Raj: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) లోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి అవుతూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. తనను తాను ఒక “బొద్దింక”గా అభివర్ణించుకుంటూనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ ఐస్‌క్రీమ్‌లో మామిడి పండు గుజ్జును కలుపుకుని తింటూ కనిపించారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్, చేసిన కామెంట్లు ఈ వ్యంగ్య రాజకీయ ఉద్యమానికి మరింత హైప్‌ను తీసుకొచ్చాయి. “బొద్దింకలు మామిడి పండ్లను ఎలా తింటాయో చూడండి” అంటూ ప్రధానమంత్రికి ఇష్టమైన పండుగా చెప్పుకునే మామిడి పండును తింటూ ప్రకాశ్‌రాజ్ ఈ సెటైరికల్ జిల్లేడును విసిరారు. “కాక్‌రోచ్ ఈటింగ్ మ్యాంగోస్.. యమ్మీ” అంటూ #CockroachJantaParty, తన మార్క్ హ్యాష్‌ట్యాగ్ #justasking జత చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. 61 ఏళ్ల ప్రకాష్ రాజ్ మొదటి నుంచీ ఈ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వడమే కాకుండా.. వాటి పోస్టులను షేర్ చేస్తూ యువత గొంతుకను మరింత మందికి చేరువ చేస్తున్నారు.
ఈ సరికొత్త ఆన్‌లైన్ ట్రెండ్ కేవలం ప్రకాష్ రాజ్‌తోనే ఆగిపోలేదు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటీమణులు దియా మీర్జా, ఈషా గుప్తా, ఫాతిమా సనా షేక్, దర్శకుడు కునాల్ కోహ్లీ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కాక్‌రోచ్ జనతా పార్టీ అఫీషియల్ అకౌంట్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. డిజిటల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే అనే 30 ఏళ్ల బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ప్రారంభించిన ఈ వ్యంగ్య ప్రచారం.. ఇంటర్నెట్‌లో ఒక చిన్న జోక్‌లా మొదలై ఇప్పుడు పెను తుఫాన్‌లా మారింది. మే 16న లాంచ్ అయిన ఈ కాక్‌రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ.. కేవలం ఆరు రోజుల్లోనే ఏకంగా 19 మిలియన్ల (1.9 కోట్లు) ఫాలోవర్ల మార్కును దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
