తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు( సోమవారం ) ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయంలోనే ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన పార్థీవదేహాన్ని ఆదివారం సాయంత్రం నుంచి.. ఎల్బీ స్టేడియంలో ఉంచారు. తద్వారా బంధువులు, అభిమానులు, ఉద్యమకారులు.. ఆయన్ని కడసారి చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకూ పార్థీవదేహాన్ని ఎల్బీ స్టేడియంలోనే ఉంచి.. ఆ తర్వాత.. గన్ పార్క్, అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఉంచి అక్కడ నుంచి.. అల్వాల్‌లోని గద్దర్ ఇంటికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అంతిమయాత్ర కొనసాగనుంది.
Read Also: Tirumala: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. వైవీ సుబ్బారెడ్డికి ఇదే చివరి మీటింగ్
అయితే, మూడు రోజుల కిందట అపోలో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న గద్దర్.. ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటూ.. ఎన్నో పోరాటాలకు తన పాటలతోనే గద్దర్ ఊపిరి పోశారు. ఆయన పాటలో ఏదో తెలియని ఉత్సాహం ఉండేది. అదో రిథమిక్.. ఆ పాటలు వింటూ ఉంటే.. మనిషిలోని నిరుత్సహం మొత్తం మాయమై.. ఎక్కడలేని కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకే గద్దర్ పాటలన్నా, ఆయన జీవన శైలి అన్నా ఎంతో మందికి ఇష్టం.. ముఖ్యంగా పొడుస్తున్న పొద్దు మీద అనే పాటతో.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి గద్దర్ నడిపించారు.ఆయన ఇక మన మధ్య లేరు అనే వార్తను జీర్ణించుకోవడం కష్టమే.