Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం: సీఎం చంద్రబాబు

  • అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
  • పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం
  • విగ్రహాన్ని 'స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్'గా నామకరణం
Cm Chandrababu

Cm Chandrababu

అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’గా నామకరణం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ప్రశంసించారు. బీజేపీ నాయకుడు మాధవ్ రాష్ట్రం మొత్తం తిరుగుతూ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో సహకారం అందిస్తున్నారని సీఎం చెప్పారు.

పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా ఈ 58 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘కేవలం 58 రోజుల్లోనే ఈ విగ్రహ నిర్మాణం పూర్తయింది. విగ్రహం పైభాగానికి ఎక్కి చూస్తే అమరావతి రాజధాని మొత్తం కనిపిస్తుంది. అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. కొందరు అమరావతి గురించి తప్పుడు ప్రచారం చేస్తూ.. ఈ రాజధానిని స్మశానం, ఎడారి అంటూ విమర్శలు చేశారు. కానీ రైతులు తమ భూములను ఇచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి నిర్మాణానికి భాగస్వాములు అయ్యారు’ అని గుర్తు చేశారు.

Also Read: Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్

‘పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన త్యాగం మొత్తం తెలుగు ప్రజలకే ప్రేరణగా నిలిచింది. ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఈ విగ్రహ నిర్మాణంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పడిన కూటమి ప్రజలకు మంచి ఫలితాలు అందిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం అవసరం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందం, ఆరోగ్యం, ఆదాయం కలిగి ఉండేలా పని చేయడమే నిజమైన నివాళి’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.