Lal Darwaza Bonalu 2025: లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా సింహవాహిని అమ్మవారిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దర్శనం తర్వాత మంత్రి పొన్నంమీడియాతో మాట్లాడుతూ… ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని.. మంచి వర్షాలతో పాడి పంటలు సంవృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నా అని చెప్పారు.
‘గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమై.. జూలై 1 బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 13వ తేదీ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఈరోజు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు జరుపుకుంటున్నాం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. హైదరాబాద్ బోనాల ఏర్పాట్లలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్, దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకొని ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. హైదరాబాద్ ప్రజలు బోనాల పండగకు ఆతిథ్యం ఇచ్చారు. అమ్మవారి కటాక్షం, లక్ష్మి కటాక్షం, విద్యా కటాక్షం ఉండేలా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. అమ్మవారి బోనాల సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Also Read: Madhavaram Krishna Rao: జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధం.. ఎమ్మెల్యే మాధవరం ఆసక్తికర వ్యాఖ్యలు!
‘ఎంతో ఘనంగా బోనాల ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రజల తరుపున ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని క్షేమంగా చూడాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా చూడాలని కోరుకున్నాము. ఆలయానికి తరలి వచ్చిన వేలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉంది. బోనాల ఉత్సవాలకు 20 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి, దేవాలయ అభివృద్ధికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు.