Site icon NTV Telugu

Ponnam Prabhakar: మా బాధ్యత నిర్వహించాం.. ఇక మీ చేతుల్లోనే ఉంది..!

Ponnamprabhakar

Ponnamprabhakar

Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పంపామని.. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్చి 30 నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బిల్లులు పాస్ చేసుకున్నట్లు చెప్పారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం, తదుపరి చర్యలు తీసుకపోవడం వల్ల అమలు జాప్యం జరుగుతుందన్నారు. న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తాం.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు.. అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మాదిగ దండోరా, మాల మహానాడు, బీసీ సంఘాలు ఐక్య సమితిగా బంద్‌కి పిలునిచ్చారన్నారు. వారికి అభినందనలు తెలిపారు.

READ MORE: Python: అక్కా.. అది అనకొండ.. ఆడుకునే వస్తువు కాదు.. జర పైలం

బంద్ ప్రశాంతంగా జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. “రవాణా శాఖ మంత్రి గా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు అసౌకర్యం అయినప్పటికీ బంద్ ప్రభుత్వాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డిలు, బీజేపీ ఎంపీ లంతా తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి చెప్పే ప్రయత్నాలు చేయాలి. రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుంది.. కేంద్రంలో బాధ్యత మీది.. రాష్ట్రంలో మా బాధ్యత నిర్వహించాం.. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఏ న్యాయస్థానంలో అయినా మేము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం.. బంద్ లో పాల్గొన్న ప్రజలకు అభినందనలు..” అని పొన్నం వ్యాఖ్యానించారు.

Exit mobile version