NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో హంగ్‌ వచ్చే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్‌కు క్లియర్ మెజారిటీ పక్కా..

Ponguleti

Ponguleti

Ponguleti Srinivas Reddy: ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారనే చూసే కాంగ్రెస్‌లో చేరానని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరే ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నానని ఆయన తెలిపారు. నాకు స్వార్థం ఉంటే అధికార పార్టీలోనే ఉండే వాడినని ఆయన వెల్లడించారు. కేంద్రం నుంచి నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని.. వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తామన్నారని.. కానీ కేంద్రం ఇస్తు్‌న్న ఆ ఆఫర్లను చూసి నవ్వి ఊరుకున్నానని ఆయన చెప్పారు. తుమ్మలకు నాకు ఎలాంటి వైరం లేదని పొంగులేటి పేర్కొన్నారు. తుమ్మలను నేను ఓడించాననేది నిజం కాదన్నారు.

కూతురి పెళ్లి కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాననేది అవాస్తవమని పొంగలేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సభల్లో నాపై సీఎం కేసీఆర్ ఆక్రోశం వెళ్లగక్కారని.. నాకు డబ్బు మదం ఉందని కేసీఆర్‌ మాట్లాడారని ఆయన చెప్పారు. ధనం బలం కాదు.. జన బలం ఉంటే ఏదైనా జరుగుతుందని ఆయన అన్నారు. డబ్బుతో రాజకీయం చేస్తుంది బీఆర్‌ఎస్‌ నేతలేనని పొంగులేటి స్పష్టం చేశారు. డబ్బుతో ఏమైనా చేయగలమనే అహంకారం నాకుందా? కేసీఆర్‌కు ఉందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే తెలిసే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన చెప్పారు. బలమైన నేతలను టార్గెట్‌ చేసుకుని ఐటీ దాడులు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఐటీ దాడుల్లో బీఆర్‌ఎస్‌ నేతలను వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also Read: Ponguleti Srinivas Reddy Exclusive Interview: ఎన్టీవీ లైవ్‌లో పొంగులేటి..

వ్యాపార రీత్యా సీఎం జగన్‌ను కలిస్తే తప్పేంటని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్‌ రెడ్డితో వ్యాపార విషయాలు తప్ప రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దనే షర్మిల కోరుకున్నారని.. అందుకే షర్మిల కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని తెలిపారు. షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరికి ఏం పదవి వస్తుందన్నది చెప్పలేమన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నేదే అందరి తపన అని ఆయన పేర్కొన్నారు. నన్ను ఓడించేందుకు కేసీఆర్‌ ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరన్నారు. తెలంగాణలో హంగ్‌ వచ్చే ప్రసక్తే లేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు క్లియర్‌ మెజారిటీ ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు బినామీ అనేది అబద్ధమని.. జగన్‌ను కలిసినప్పుడు నిందలు మోపడం సాధారణమన్నారు.