Attack on Police Station: పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరన్ తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఈ తెల్లవారుజామున రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తేలికపాటి రాకెట్‌తో ఉగ్రవాదులు దాడి చేశారని వెల్లడించారు. అమృత్‌సర్-భటిండా హైవేలోని సర్హాలి పోలీస్ స్టేషన్‌పై తెల్లవారుజామున 1 గంటలకు దాడి జరిగిందని, భవనానికి స్వల్ప నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాకెట్-లాంచర్-రకం ఆయుధం మొదట స్తంభాన్ని ఢీకొట్టి, ఆపై పోలీసు స్టేషన్‌ను తాకినట్లు వర్గాలు తెలిపాయి. అదృష్టవశాత్తూ ఈ దాడిలో తమ సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని వివరించారు. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉన్న స్టేషన్‌పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
పాకిస్తాన్‌లో మరణించినట్లు భావిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా స్వస్థలం సర్హాలి. రిండా మరణించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో రిండా ప్రాణాలతో ఉండాలని ఐఎస్ఐ కోరుకుంటోందని, రిండాకు హాని తలపెట్టొద్దనే హెచ్చరిక పంపేందుకే తాజా రాకెట్ దాడి జరిపినట్లు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా హర్విందర్ సింగ్ రిండా 15 రోజుల పాటు లాహోర్‌లోని ఆసుపత్రిలో చేరారని, అక్కడ అతను మరణించాడని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కాగా, పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
Drone Attack: దేశ అధ్యక్షుడిపై డ్రోన్ దాడికి పాల్పడిన ముగ్గురికి 30 ఏళ్ల జైలుశిక్ష
ఈ ఏడాది మే లో ఏకంగా మొహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపైనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఉగ్రవాదులు ఇలాగే తేలికపాటి రాకెట్‌తో దాడి చేశారు. అయితే, ఆ దాడిలోనూ ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని పోలీసులు చెప్పారు. మరోవైపు, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అరాచకాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆ పార్టీపై విరుచుకుపడ్డారు.