విదేశీ పర్యటనలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు దేశ ప్రధాని నరేంద్రమోడీ. విదేశాలతో మెరుగైన సంబంధాలే లక్ష్యంగా ఎప్పుడూ ముందుకు సాగుతుంటారు. ఈ క్రమంలోనే మోడీ 2019 నుంచి 21 అధికారిక విదేశీ ప్రయాణాలు చేశారు. ప్రధాని చేసిన అధికారిక విదేశీ ప్రయాణాల మొత్తం ఖర్చు రూ.22.76 కోట్లు అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ పార్లమెంటుకు తెలిపారు. అదే నాలుగేళ్ల కాలంలో రాష్ట్రపతి 8 అధికారిక విదేశీ ప్రయాణాలు చేశారని, ఆ ప్రయాణాలకు గానూ రూ. 6.24 కోట్లు ఖర్చు అయ్యాయని మురళీధరన్ రాజ్యసభకు తెలిపిన లిఖిత పూర్వక సమాధానంలో వివరించారు. పీఎం అఫిషియల్ టూర్ కోసం రూ. 22,76,76,934 ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయిందని, అలాగే, రాష్ట్రపతి అధికారిక పర్యటనల కోసం రూ. 6,24,31,424 ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయిందని వెల్లడించారు.
Also Read: Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో నెయ్యి, వంట నూనెల కొరత..
అలాగే 2019 నుంచి విదేశాంగ మంత్రి చేసిన వివిధ దేశాల పర్యటనల ఖర్చు రూ. 20.87 కోట్లని మురళీధరన్ తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ నాలుగేళ్లలో అధికారికంగా 86 విదేశీ పర్యటనలు జరిపారని వెల్లడించారు. ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో మూడుసార్లు జపాన్, రెండుసార్లు అమెరికా, రెండు సార్లు యూఏఈ లలో పర్యటించారు. అలాగే రాష్ట్రపతి చేసిన 8 పర్యటనల్లో ఏడు పర్యటనలను గత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేయగా, ఒక పర్యటనను ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేశారు. ద్రౌపది ముర్ము గత సెప్టెంబర్‌లో యూకే వెళ్లారు.
Also Read: WhatsApp: వాట్సాప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్