Site icon NTV Telugu

PM Narendra Modi: సీఎం చంద్రబాబు, మంత్రులకు మోడీ అభినందనలు.. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాం..

Modi

Modi

PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.. ముఖ్యమంత్రిగా నాల్గోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. సీఎం చంద్రబాబుతో.. మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌తో.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, నందమూరి బాలకృష్ణ సహా పలువురు నేతలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇక, ఆ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా సీఎం, కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Read Also: Italy:ఇటలీలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఖలిస్తానీ మద్దతుదారులు..రేపు మోడీ పర్యటన సందర్భంగా దుశ్చర్య

ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ విషయానికి వస్తే.. ”ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి టీడీపీ, జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.” అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక, తన ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేవారు ప్రధాని నరేంద్రమోడీ.

Exit mobile version