జార్ఖండ్ పర్యటనలో భాగంగా రెండో రోజైన నేడు ప్రధాని నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అయితే, ఇవాళ ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల జాబితా పెద్దగానే ఉంది. ఐఐఎం రాంచీ, ట్రిపుల్ ఐటీ భవనాలను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ప్రధాని ఈ ఉదయం రాంచీలోని భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
Read Also: Katrina Kaif: శారీ పిక్స్ తో చెమటలు పట్టిస్తున్న కత్రినా కైఫ్
అయితే, ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు తన ట్విట్టర్( x ) హ్యాండిల్‌లో జార్ఖాండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ ఖనిజ వనరులతో పాటు గిరిజన సమాజం యొక్క ధైర్యం, ఆత్మగౌరవానికి ప్రసిద్ధి చెందిందని ఆయన రాసుకొచ్చారు. ఇక్కడి నా కుటుంబ సభ్యులు దేశ ప్రగతికి ఎంతో కృషి చేశారు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటున్నాను అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జార్ఖండ్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియంతో పాటు సహజ వాయువు వంటి అనేక రంగాలలో సుమారు 7200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇక, ఉలిహతు నుండి వికాస్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని ప్రారంభించారు.