కేంద్ర మంత్రివర్గం మార్చి 3న సమావేశం అవుతోంది. ప్రధాని మోడీ (Narendra Modi) నేతృత్వంలో మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. వచ్చే నెల 7 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావొచ్చంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 3న కేంద్ర కేబినెట్ భేటీ కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ఈ సమావేశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందే కేంద్ర మంత్రిమండలి భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి.. ఎన్నికల సంసిద్ధతను పర్యవేక్షిస్తోంది.
ఇదిలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 9 తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం శాసనసభలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సిఉంది. వీటితోపాటు జమ్మూకశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. త్వరలోనే ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనుంది.
మరోవైపు ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ఆయా అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇలా ప్రతీ రోజూ మోడీ అభివృద్ధి పనులు ప్రారంభిస్తు్న్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం భేటీ కానుండడం ఆసక్తి రేపుతోంది. ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారా? అన్న అంశంపై ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది.