Gandhi Jayanti: భారతదేశం అంతటా, జాతీయ నాయకులు జాతిపిత 153వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం రాజ్ ఘాట్ లో జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మహాత్ముడు నమ్మిన సత్యం, అహింస మార్గంలో నడవాలని దేశ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు తమ జీవిత విలువలకు తమను తాము పునఃసమీక్షించుకోవడానికి మహాత్ముడి జయంతి ఓ సందర్భంగా ఆమె అభివర్ణించారు. మహాత్ముడి అడుగుజాడల్లో ప్రతి భారతీయుడు నడవాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం వేడుకలు భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను గుర్తించడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీకి నివాళిగా ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన దేశ ప్రజలను కోరారు. ఎల్లప్పుడూ బాపు ఆశయాలకు అనుగుణంగా జీవించాలన్నారు.
Read also: puducherry: అంధకారంలో పుదుచ్చేరి.. గవర్నర్, సీఎం ఇళ్లకు పవర్ కట్
ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ తన యాత్రకు నేడు విరామం ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. సత్యం, అహింస, శాంతి, మార్గదర్శకుడికి తాను నమస్కరిస్తున్నాన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.