puducherry: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అంధకారం తాండవిస్తోంది. గత నాలుగు రోజులుగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో పుదుచ్చేరి వ్యాప్తంగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు పంపిణీ, రిటైల్ వ్యవస్థల్లో 100 ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు ముందు నుంచి తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. గత నెల 27న కేంద్ర ప్రభుత్వం పంపిణీ, రిటైల్‌లో 100 ప్రైవేటీకరణకు బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్ జారీ చేసింది. దీంతో విద్యుత్తు కార్మికులు, ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. మొదటి రెండు రోజులు సమ్మె ప్రభావం పెద్దగా కనిపించకున్నా.. శుక్రవారం నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. శనివారం పుదుచ్చేరి వ్యాప్తంగా అంధకారం అలుముకుంది.
నాలుగో రోజు చేపట్టిన నిరవధిక సమ్మెతో లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం ఇండ్లకు సైతం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా ఆగిపోవటంతో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. కరెంట్ లేక పుదుచ్చేరి వీధులను చీకట్లు ఆవరించాయి. సాయంత్రం 6 గంటల తర్వాత అన్ని వీధులు చీకట్లను ఆవరించటంతో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. ఓ వైపు విద్యుత్తు కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కగా విద్యుత్తు కోతలతో విసిగిపోయిన ప్రజలు రోడ్లపై చేస్తున్న ఆందోళనలతో పుదుచ్చేరి అట్టుడికిపోతోంది. ప్రజల ఆందోళనలతో కరైకాల్-తిరువారూర్ మధ్య జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
దీంతో అక్కడి సర్కారు విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించింది. విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో పోలీసులు, ఇతర సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దించింది. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 25 సభ్యుల బృందాన్ని పంపి విద్యుత్తు పునరుద్ధణ పనులు చేపడుతున్నది. కాగా, విద్యుత్తు ఉద్యోగుల సమ్మెతో సంస్థకు ఇప్పటికే రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్టు సమాచారం. విపక్ష ఎమ్మెల్యేలు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిని కలిసి.. సమస్య పరిష్కారానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. కాగా.. విద్యుత్తు పంపిణీ వ్యవస్థల ప్రైవేటీకరణతో ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండబోదని పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు.
పుదుచ్చేరిలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పుదుచ్చేరి విద్యుత్తు శాఖ మంత్రి ఎ.నమశ్శివాయమ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరోవైపు సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఆదివారం అఖిలపక్షం సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. దసరా నవరాత్రుల నేపథ్యంలో సమ్మె సరికాదంటూ కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది.