NTV Telugu Site icon

PM Modi: బడ్జెట్‌పై ప్రధాని మోడీ ఏమన్నారంటే..!

Pm Modi

Pm Modi

గురువారం మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవనున్నారు. మోడీ సర్కార్‌కు కూడా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకూడదు.. మేము కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు మోడీ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రధాని పేర్కొన్నారు. బడ్జెట్‌తో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని.. ప్రజల ఆశీస్సులతో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశం ముందుకు సాగుతోందని.. అలాగే దేశ పురోగతి కొత్త శిఖరాలను తాకబోతుందని విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో మహిళలను భాగస్వామ్యం చేసినట్లు మోడీ గుర్తుచేశారు. బీజేపీ హయాంలో నారీమణులు అనేకమైన మేలు పొందారని తెలిపారు. కొత్త భవనంలో జరిగిన పార్లమెంట్ మొదటి సెషన్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందన్నారు. అలాగే పార్లమెంట్ కొత్త భవనంలో ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించడం.. గురువారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, అలాగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీలో జరిగిన కర్తవ్యపథ్‌లో మహిళలు కవాతు నిర్వహించడం ఇదంతా మహిళా శక్తి పండుగగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇలా ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఈ ప్రయాణం నిరంతరం ఇలానే కొనసాగుతుందని మోడీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Union Budget: తాయిలాలతో హ్యాట్రిక్ కొట్టనున్నారా?

ఇదిలా ఉంటే గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలకు తాయిలాలు ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ కూడా అదే మాదిరిగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.