దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడు కోయంబత్తూర్‌లో మోడీ భారీ రోడ్ షో నిర్వహించారు.
అయితే మోడీ రోడ్ షో నేపథ్యంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు కోయంబత్తూర్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వాస్తవానికి తొలుత మోడీ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అనంతరం మద్రాస్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో మోడీ భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ కోయంబత్తూరు పర్యటనకు కొన్ని గంటల ముందే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో భారీ భద్రత మధ్య కోయంబత్తూరులో రోడ్‌షో నిర్వహించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో కూడా ఐదు అంచెల భద్రతను అమలు చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ , కోయంబత్తూర్ సిటీ పోలీస్ మరియు అనేక ఇతర విభాగాల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీల తర్వాత మోడీ రోడ్ షో నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Tillu Square: ఉన్నది పాయే .. ఉంచుకున్నది పాయే.. లిల్లీతో ఏందీ లొల్లి.. టిల్లు
నగరంలోని మెట్టుపాళయం దగ్గర ప్రారంభమైన మోడీ రోడ్ షో.. ఆర్‌ఎస్ పురం దగ్గర ముగియనుంది. అనంతరం కన్యాకుమారిలో జరగనున్న సభలో మోడీ మాట్లాడనున్నారు.గత శనివారమే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభమై జూన్ 1న ముగియనుంది. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి.
ఇదిలా ఉంటే ఈసారి ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. మోడీ ఎక్కువ సార్లు ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. సౌతిండియాలో బీజేపీకి మొదటి నుంచి బలం తక్కువగా ఉంటుంది. అందుకోసమే ఈసారి మోడీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.