Site icon NTV Telugu

PM Modi: తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి

Pm Modi

Pm Modi

PM Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభా వేదికగా వాగ్బాణాలను సంధించారు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కరప్షన్‌, కమీషన్‌ ఈ రెండు పార్టీల సిద్ధాంతమంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబసభ్యులే ఉంటారన్నారు ప్రధాని మోడీ. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ మరో పార్టీ చేతిలో ఉందని.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసని ప్రధాని తెలిపారు. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుందన్నారు. మోడీ ఇచ్చే గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు భరోసా ఉందన్నారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని ప్రధాని చెప్పారు. రాజకీయ పార్టీలను ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలుగా మార్చారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: PM Modi: తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు..

రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని.. సాగునీటి పథకాల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ప్రధాని అన్నారు. సాగునీటి కాలువల పేరుతో తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోందన్నారు ప్రధాని మోడీ. కానీ ఆ కాలువల్లో అసలు నీరు ఉండదన్నారు. రైతు రుణమాఫీ హామీ ఇచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సరసమైన ధరల్లో రైతులకు ఎరువు అందిస్తున్నామని ప్రధాని చెప్పారు. రైతుల కోసం రామగుండం ఫెర్టిలైజర్స్‌ను తెరిపించామన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం లేకున్నా.. వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డును ప్రకటించామన్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి బిద్రీ కళాఖండాన్ని బహుమతిగా ఇచ్చామన్న ప్రధాని.. ఆ తర్వాత తెలంగాణ హస్తకళలకు మరింత గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణ హస్తకళలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

 

Exit mobile version