AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!

Pm Modi Calls Cm Chandrababu

Pm Modi Calls Cm Chandrababu

PM Modi Calls CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో వరుస తుఫాన్‌ల ప్రభావంతో సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని అర్నబ్, మురసు తుఫాన్‌లు ప్రభావితం చేసిన నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, జరిగిన నష్టంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్‌ల ప్రభావం, సహాయక చర్యలపై పీఎం, సీఎంల మధ్య చర్చ జరిగింది. తుఫాన్‌ల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయని సీఎం చంద్రబాబు ప్రధాని మోడీకి వివరించారు. ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంటలకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. అంతేకాకుండా రహదారులు, విద్యుత్ సరఫరా వ్యవస్థతో పాటు వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని సీఎం వివరించారు.

అర్నబ్, మురసు తుఫాన్‌ల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కోరారు. నష్టాన్ని అంచనా వేసి బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. మరోవైపు తుఫాన్‌ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రధాని మోడీ ప్రశంసించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. తుఫాన్‌ల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమించారని చంద్రబాబును అభినందించారు. విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోడీ ప్రశంసించారు. వరుస తుఫాన్‌లతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతుందనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పంట నష్టంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు కేంద్ర సాయం కీలకం కానుంది.