K Vishwanath: ప్రముఖ సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల రాజకీయ, సినీ, పలు రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. కళాతపస్వి మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. ఆయన సినీ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తి అని, సృజనాత్మక, బహుముఖ దర్శకుడిగా తనను తాను మలుచుకున్నారని కొనియాడారు. “కె.విశ్వనాథ్ గారు మృతి చెందడం బాధాకరం. ఆయన సినీ ప్రపంచంలో ఓ ప్రముఖుడు. తన సృజనాత్మకతతో పాటు బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న వ్యక్తి. వివిధ శైలిలో తెరకెక్కిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
సంతాపం తెలిపిన వెంకయ్యనాయుడు
ప్రముఖ తెలుగు దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ (92) గురువారం తన నివాసంలో వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో కన్నుమూశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రఖ్యాత సినీ దర్శకుడు తెలుగు సినిమాలకు గౌరవాన్ని తీసుకువచ్చారని, తన సినిమాలకు ప్రపంచ గుర్తింపును సంపాదించారని పేర్కొన్నారు.
గవర్నర్ సంతాపం
విశ్వనాథ్ మృతిపట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కళ చిరస్థాయిలో నిలిచిపోతుందని ఆమె కొనియాడారు.
సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు.
సీఎం జగన్ సంతాపం
కె.విశ్వనాథ్ మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో తీవ్రసంతాపం తెలిపారు. విశ్వనాథ్ మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్.ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దివంగత వైఎస్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును కళా తపస్వి కె.విశ్వనాథ్‌కి అందించిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులు కూడా సంతాపం తెలిపారు. కళా తపస్వి , దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ. కళాతపస్వి, దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మరణం పట్ల బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతిక సంప్రదాయాలను, సంగీత సాహిత్యలను తన సృజనాత్మకమైన మార్క్‌తో తెలుగు తెరపై కళాతపస్వి కె.విశ్వనాథ్ ఆవిష్కరించారని మంత్రి అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ సంతాపం
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘’నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈరోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
కె.విశ్వనాథ్ భౌతికకాయానికి సినీనటుడు, జనసేనఅధినేత పవన్‌కళ్యాణ్ నివాళులర్పించారు. త్రివిక్రమ్ సత్యానంద్‌లతో కలిసి విశ్వనాథ్ పార్థివదేహాన్ని ఆయన సందర్శించారు. ‘శంకరాభరణం’ సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదని తెలిసిందన్నారు. ఆయన సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటాయన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సినీ పరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ
“కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. కళాతపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.” – నందమూరి బాలకృష్ణ
ఆయన సేవ అజరామరం:కమల్‌హాసన్
కె.విశ్వనాథ్ మృతి పట్ల కమల్‌హాసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళ సజీవమైనది.. అజరామరం అని పూర్తిగా అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.
సంతాపం తెలిపిన తెలంగాణ మంత్రులు
కళాతపస్వి మృతి పట్ల తెలంగాణ మంత్రులు తీవ్ర సంతాపం తెలిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ తమ సంతాపాన్ని ప్రకటించారు. వారు లేని లోటు కేవలం సిని పరిశ్రమకే కాదని యావత్ తెలుగు సమాజానికి తీరని లోటు అన్నారు.