ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సిద్దమైంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. కొత్త జట్టు కోసం ప్రణాళికలు రూపొందించింది. వేలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. భారీ ధర పెట్టైనా రాహుల్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించాలనే ప్రణాళికతో ఆర్‌సీబీ ఉందట. అయితే వేలంకు ముందే సపోర్ట్ స్టాఫ్ విషయంలోనూ ఆర్‌సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
ఆర్‌సీబీ తమ బౌలింగ్ కోచ్‌గా ముంబై రంజీ టీమ్ హెడ్ కోచ్ ఓంకార్ సాల్విని నియమించుకుంది. ఈ దేశవాళీ సీజన్ ముగిసిన తర్వాత సాల్వి కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సాల్వి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. 2005లో రైల్వేస్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడి.. ఒక వికెట్ తీశాడు. అయితే ఓంకార్‌కు ఆటగాడిగా అనుభవం లేకున్నా.. కోచ్‌గా మాత్రం సూపర్ క్రేజ్ ఉంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా సాల్వి పనిచేశారు. అక్కడ అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
Also Read: Champions Trophy 2025: కాస్త ఓపిక పట్టండి.. ఏం జరుగుతుందో చూస్తారు: పీసీబీ చీఫ్
రంజీ ట్రోఫీ 2023-24కు ముందు ముంబై హెడ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి బాధ్యతలు అందుకున్నారు. అతడి పర్యవేక్షణలో అద్భుతంగా రాణించిన ముంబై జట్టు ఏకంగా టైటిల్ సాధించింది. 8 ఏళ్ల తర్వాత ముంబై రంజీ ట్రోఫీ గెలవడంతో.. సాల్వి పేరు బయటికొచ్చింది. అనంతరం ఇరానీ కప్‌ను కూడా ముంబై కైవసం చేసుకుంది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇరానీ కప్‌ను ముంబై గెలవడంతో.. సాల్వి పేరు మార్మోగిపోయింది. బౌలింగ్ కోచ్‌గా మంచి అనుభవం ఉన్న సాల్విని ఆర్‌సీబీ తమ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. ముంబై జట్టుతో అతడి కాంట్రాక్ట్ 2025 మార్చిలో ముగియనుంది.