రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ఇవ్వడం లేదని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు అని కూటమి ప్రభుత్వంను విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండటం సమాజానికి విచారకరం అని పేర్కొన్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్ గారిని తిట్టడానికి తప్ప ఎక్కడైనా తిరిగారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. శుక్రవారం అమరావతిలో మాజీమంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
‘ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండటం సమాజానికి విచారకరం. ధాన్యం, పత్తి, మిర్చి, పొగాకు, కోకో.. తాజాగా మామిడి పంటలు పండుతున్న రైతుల కడగండ్లు ప్రభుత్వానికి కనిపించటం లేదు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అర్థం ఏంటి?. ముందు నుంచి ఒకరు.. వెనుక నుంచి మరొకరు కోస్తారని అర్థమా?. రైతుల గోడు పట్టించుకునే నాధుడు లేడు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్‌ను తిట్టడానికి తప్ప ఎక్కడైనా తిరిగారా?. హామీలు ఇచ్చిన మూడు పార్టీల్లో ఇద్దరు అవునంటారు.. మరొకరు తెలియదు అంటారు. వ్యవసాయ శాఖ మంత్రి రైతుల బాధలు పట్టించుకుంటున్నారా?. మిర్చి, పొగాకు రైతుల బాధలు చూడటానికి వెళ్తే సినిమా సెట్టింగుల యాత్రలు అంటారు. జగన్ వెళ్తుంటే విమర్శిస్తారు.. మీరు వెళ్ళి చూస్తుంటారు. మిర్చి యార్డు ఉన్న కేంద్ర మంత్రి రైతుల కోసం వెళ్లారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల కోసం వెళ్లారా?. మీరు పట్టించుకోరు, రైతులకు గిట్టుబాటు ఇవ్వరు.. జగన్ వెళ్తే ఏడుస్తారు’ అని పేర్ని నాని మండిపడ్డారు.
‘పొగాకు రైతుల కోసం జగన్ వెళ్తే ఒక 20 మంది పచ్చ మూకలను పంపిస్తారు. వాళ్లకు డబ్బులు ఇచ్చి పంపిస్తారు. మీ టీవీ డిబేట్లలో డబ్బులు ఇచ్చి జగన్‌ను తిట్టిస్తారు. జగన్‌ను తిట్టకుండా ఒక్క డిబేట్ ఉంటుందా?. మీరు వచ్చినప్పటి నుంచి చేసిందేమీ లేదు కాబట్టి.. జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఉదయం, సాయంత్రం మీ వ్యాపారం మొత్తం జగన్ మీదే కదా. ఇవాళ మామిడి రైతుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ పర్యటనకు హెలెక్రాఫ్టర్కు పర్మిషన్ ఇవ్వరు. తప్పుడు మాటలు.. విష ప్రచారం.. అసత్యాలు మాట్లాడుతున్నారు. జగన్ బంగారుపాళ్యం వెళ్తున్నారని కేబినెట్లో తీర్మానం చేస్తారు. వీళ్లకు అబద్దాల ప్రచారం తప్ప మరొకటి లేదు. 9వ తేదీ జగన్ వెళ్ళగానే 260 కోట్లు విడుదల చేశామన్నారు.. జీవో వచ్చిందా. ఎవరికైనా సమాచారం ఉందా?. ఒక్క మామిడి రైతుకన్నా న్యాయం చేశారా. రైతు కష్టం గురించి తెలియని వాళ్ళు.. విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి 80 శాతం కొనేసాము అంటారు. మరో మంత్రి 90 శాతం కొన్నారని అంటారు.. ఎవరిది నిజం’ అని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
Also Read: Brian Lara: ముల్డర్.. త్యాగం అసవరం లేదు, ఈసారి 400 కొట్టేయ్: లారా
‘జగన్ వెళ్తున్నారని.. వాడు, వీడు అంటున్నాడు. మిమ్మల్ని వాడు, వీడు అనలేమా. జగన్ ఎప్పుడు కూడా వాడు, వీడు అని శత్రువుల గురించి కూడా మాట్లాడరు. అమ్మఒడి అందరికీ వేశామని చెప్పారు.. లక్ష మందికి అయినా 13 వేలు పడ్డాయా. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దగ్గరి నుంచి ఎలా వంచించాలో నేర్చుకోవాలి. 6.50 లక్షల టన్నుల పంట పండింది. 80 శాతం కొన్నామని వ్యవసాయ శాఖ మంత్రి.. 90 శాతం కొన్నామని సివిల్ సప్లై మంత్రి చెబుతారు. కలెక్టర్ మాత్రం 67 శాతం అని చెప్పారు. ఒక్క రైతు దగ్గరకు వెళ్లని వ్యవసాయ మంత్రి 80 శాతం కొనేసామని చెప్పారు.. సివిల్ సప్లై మంత్రి 90 శాతం అంటారు. మీ అబద్ధాలకు పోయే కాలం రాదా. ఫైనాన్స్ కాన్కరెన్స్ లేకుండా జీవో ఫైల్ జెనరేట్ చేశారు. ఏమీ చేయకుండా మమ అనేశారు’ అని పేర్ని నాని విమర్శించారు.