జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టెస్టుల్లో రికార్డు స్కోర్ 400 పరుగులు చేసే ఛాన్స్ వచ్చినా.. కావాలనే వదిలేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాపై ఉన్న గౌరవంతోనే 400 పరుగులు చేయలేదని ముల్డర్ తెలిపాడు. ముల్డర్ వ్యాఖ్యలపై లారా స్పందించాడు. క్రికెట్ దిగ్గజం లారాతో జరిగిన సంభాషణను తాజాగా ముల్డర్ వెల్లడించాడు.
సూపర్ స్పోర్ట్‌తో వియాన్ ముల్డర్ మాట్లాడుతూ… ‘జింబాబ్వే మ్యాచ్ తర్వాత బ్రియాన్ లారాతో మాట్లాడా. రికార్డులు బ్రేక్ చేసేందుకే ఉన్నాయని, తన రికార్డును మరొకరు అధిగమించాలని కోరుకుంటున్నా అని నాతో చెప్పారు. ఇంకో ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దని నాకు సూచించారు. 400 కాదు అంతకంటే ఎక్కువే పరుగులు చేయమన్నారు. సొంతంగా కష్టపడి ఈ లెగసీని సృష్టించుకున్నా అని, 400 రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తే తనకు సంతోషంగా ఉంటుందని లారా చెప్పారు’ అని ముల్డర్ తెలిపాడు.
Also Read: Virgin Boys Review: ‘వర్జిన్ బాయ్స్’ రివ్యూ.. ఇంతకీ వర్జినిటీ కోల్పోయారా? లేదా
‘నేను సరైన నిర్ణయమే తీసుకున్నా అని భావిస్తున్నా. ఆట గౌరవాన్ని కాపాడాలి. భారీ స్కోర్లు దిగ్గజాల పేరిటే ఉంటే బాగుంటుంది’ అని వియాన్ ముల్డర్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను 626/5 వద్ద డిక్లేర్ చేయాలనే ముల్డర్ నిర్ణయంపై అభిమానులు, క్రికెట్ మాజీలు షాక్ అయ్యారు. క్రిస్ గేల్, బెన్ స్టోక్స్ ఇప్పటికే ముల్డర్ నిర్ణయంపై అసంస్తృప్తి వ్యక్తం చేశారు. లారా రికార్డు (400 పరుగులు)ను బద్దలు కొట్టే ఛాన్స్ ముల్డర్‌కు మరోసారి రాదని చెప్పారు.