Perni nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్లకు కౌంటర్ ఎటాక్ దిగారు వైసీపీ నేతలు.. తాజాగా, పొత్తుల వ్యవహారంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి పేర్నినాని.. జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ.. చంద్రబాబు అవసరాల కోసం పెట్టిన టెంట్ హౌస్ పార్టీ జనసేన అంటూ సెటైర్లు వేశారు. ఓట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేయడం పవన కళ్యాణ్ కి చెల్లిందన్న ఆయన.. వారాహి అంటూ హడావిడి చేసిన పవన్ ముందస్తు ఎన్నికలు ఉంటే బయటకు తీస్తా అంటున్నాడు అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుకి అవసరమైన ప్రతిసారీ పవన్ బయటకు వస్తాడన్న ఆయన.. పవన కళ్యాణ్ కి పార్టీ పెట్టిన సమయంలోనే బలం లేదని తెలుసు.. ఇప్పుడు బలం లేదని పవన్ చెబుతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Pawan Kalyan Live: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
2014లో బలం లేదు పోటీ చేయలేదన్న పవన్ కల్యాణ్.. 2019లో ఎందుకు పోటీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు పేర్నినాని.. 2019లో చంద్రబాబుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్ గుర్తించాడు.. ప్రజా వ్యతిరేక ఓటు జగన్ కు వెళ్లకుండా పవన్ కల్యాణ్ 2019లో పోటీకి దిగాడని ఆరోపించారు. ఇక, పవన్ కల్యాణ్‌ను సీఎం చేయాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు మాని జన సైనికులు రోడ్లపై తిరుగుతున్నారు.. వాళ్ల గురించే నా బాధ అన్నారు. జన సైనికులు పవన్ కల్యాణ్ కోసం త్యాగాలు మాని తల్లిదండ్రుల ఆశలు తీర్చాలని సూచించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్నినాని.