Pemmasani Chandrashekar: ‘కేవలం అవినీతి అధికారులు, నాయకులు చేసిన కక్కుర్తి వల్ల గుంటూరు కార్పోరేషన్ పరిధిలో నీటి సమస్య తలెత్తింది. ఎన్నికలు పూర్తి కాగానే ఒక్కొక్కరి భాగోతం బయటపెడతాను, నీటి సమస్య పరిష్కరిస్తాను.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా తక్కెళ్ళపాడు, వెంకట కృష్ణాపురం, ఉప్పలపాడు, నంబూరు తదితర గ్రామాలలో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. ఉప్పలపాడులో సహకరిస్తున్న కార్యకర్తలను, ప్రజలను చూస్తుంటే అసలు ఈ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు గ్రామం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి పెమ్మసాని, దూళిపాళ్ల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అనంతరం ధూళిపాళ్ల మాట్లాడుతూ.. గ్రామంలో వేసిన ప్రతి రోడ్డు టీడీపీ హయాంలో వేసిందే తప్ప.. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఒక్క రోడ్డు కూడా నిర్మింపబడలేదని తెలిపారు. నీళ్లు ఇవ్వలేక సర్పంచ్, అధికారులు తిప్పలు పడుతున్నారని, నాలుగేళ్ల పది నెలలుగా చేయని నీటి సరఫరా కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. ఈ ప్రచారం కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వడ్రానం మార్కండేయులు, పెదకాకాని మండల జనసేన అధ్యక్షుడు వెంకటరావు, టీడీపీ రాష్ట్ర మైనారిటీ అధికార ప్రతినిధి మోసిఫ్, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, తాళ్ల వెంకటేష్ యాదవ్, తదితర టీడీపీ, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు.