అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు పెమా ఖండూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో జరిగిన సమావేశంలో పెమా ఖండూను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా హాజరయ్యారు. సాయంత్రం పెమా ఖండూ, తరుణ్ చుగ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేటి పరానాయక్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఇక, ప్రమాణ స్వీకారానికి పెమా ఖండూ, ఆయన మంత్రులను గవర్నర్ ఆహ్వానించారు.
Read Also: Chandrababu: సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం!
కాగా, పెమా ఖండూ ముఖ్యమంత్రిగా ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, ఖండూకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రశంసించారు. బీజేపీపై విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం ఖండూ కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు లోక్‌సభ ఎంపీలతో సహా పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసినందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలను ఆయన అభినందించారు. కొత్త ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యేలా చూస్తామని రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇచ్చానని ఖండూ చెప్పుకొచ్చారు.