ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉందట ఆ నియోజకవర్గంలోని బీజేపీ నేతల తీరు. రేపోమాపో అసెంబ్లీ ఎన్నికలన్నట్టుగా.. సీటు కోసం కొట్టేసుకుంటున్నారు. ఎవరో వస్తారు.. తమ సీటుకు ఎసరు పెడతారనే అనుమానంతో రచ్చ చర్చ చేస్తున్నారట.
తెలంగాణలో బీజేపీ నేతల ఆలోచనలకు.. పెద్దపల్లిలోని పార్టీ నేతల ఎత్తుగడలకు అస్సలు పొంతన కుదరడం లేదు. వారు ఎడ్డెం అంటే.. వీళ్లు తెడ్డెం అనే పరిస్థితి. ఇంకా గట్టిగా చెప్పాలంటే నియోజకవర్గంలో పార్టీ తీరు మూడు ముక్కలాటలా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి.. ఆ మధ్య జేపీ నడ్డాను కలిసిన గొట్టిముక్కల సురేష్‌రెడ్డి.. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావుల మధ్య ఉప్పు నిప్పులా ఉన్నాయి పార్టీ యవ్వారాలు. ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి జిల్లాకు వస్తున్న తరుణంలో కలిసి సాగాల్సిన నాయకులు సైతం ఎవరికి వారుగా సమావేశాలు పెట్టుకోవడం.. పత్రికా ప్రకటనలు ఇవ్వడం రచ్చ రచ్చ లేపుతోంది.
ఆ మధ్య అసమ్మతి నేతగా గుజ్జుల అలజడి
మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఆ మధ్య అసమ్మతి నేతగా ముద్ర పడింది. వరస సమావేశాలతో బీజేపీ శిబిరంలో అలజడి రేపారు. బుజ్జగింపులో లేక మందలింపులో కానీ.. సడెన్‌గా కామ్ అయ్యారు. ఇప్పుడు మోడీ పర్యటన తరుణంలో మళ్లీ చర్చల్లోకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే. ప్రధాని వస్తుంటే తమకు ఆహ్వానం లేదని ఆరోపిస్తూ.. తన వర్గంలో ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్నారట రామకృష్ణారెడ్డి. బీజేపీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆ సమావేశంలో వాపోయారట. అక్కడితో ఆగకుండా.. బీజేపీలో చేరాలని అనుకుంటున్న నేతల తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట.
తనకు పోటీగా ఉన్నవారిపై గుజ్జుల ఫైర్
మరో మాజీ ఎమ్మెల్యే గొట్టిముక్కల రాజారెడ్డి కుమారుడు సురేష్‌రెడ్డి.. ఆ మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. సురేష్‌రెడ్డి సైతం కార్యక్రమాల వేగం పెంచుతున్నారు. ఆయన్ని దృష్టిలో ఉంచుకునే రామకృష్ణారెడ్డి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని సమాచారం. సురేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ స్వరం పెంచుతున్నారు. గత ఎన్నికల్లో పెద్దపల్లిలో తాను ఒక్కడినే ఓడిపోలేదని.. రాష్ట్రంలో వందమందికిపైగా డిపాజిట్ కోల్పోయిన సంగతి మర్చిపోకూడదని మండిపడుతున్నారు రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయారాం గయారాంలకు టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నారట.
లోకల్ లీడర్స్‌కు పార్టీ పెద్దల ఆశీసులు
వాస్తవానికి రామకృష్ణారెడ్డి 1999లో ఇక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఏ ఎన్నికల్లోనూ ఆయన గెలిచింది లేదు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని భావిస్తూ.. మరోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు. అయితే కొత్తగా బీజేపీలో చేరేవాళ్లు తనకు ఎక్కడ పోటీకి వస్తారో అని రామకృష్ణారెడ్డి సందేహిస్తున్నారట. వీరిద్దరి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న దుగ్యాల ప్రదీప్‌రావు సైతం గట్టిగానే పావులు కదుపుతున్నారట. వీరిలో గుజ్జుల రామకృష్ణారెడ్డికి బీజేపీలో కొందరు సీనియర్లు మద్దతు ఇస్తుండగా.. గొట్టిముక్కల సురేష్‌రెడ్డికి.. పార్టీలో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ ఆశీసులు ఉన్నాయట. ఇక ప్రదీప్‌రావుకు బండి సంజయ్ అండగా ఉన్నారని చెబుతున్నారు.
ఈ దఫా అభ్యర్థిని మార్చేస్తారా?
ఈ దఫా అభ్యర్థిని మార్చాలని అనుకుంటే.. రామకృష్ణారెడ్డి ప్లేస్‌లో సురేష్‌రెడ్డి లేదా ప్రదీప్‌రావుల్లో ఒకరికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం బీజేపీ వర్గాల్లో ఉందట. అది తెలిసే మాజీ ఎమ్మెల్యే దూకుడు పెంచారని.. నోటికి పని చెబుతున్నారని భావిస్తున్నారు. మరి.. ఈ సమస్యకు పార్టీ పెద్దలు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.