Namburu Sankara Rao: ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తనను ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాశిపాడులో ప్రతి ఇంటికి సంక్షేమం అందడంతో పాటు.. అభివృద్ధి కూడా జరగడంతో గ్రామస్థులు సంతోషంగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. బాణా సంచా పేలుస్తూ.. పూలతో తమ అభిమానాన్ని చూపించారు. వందలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు ఎమ్మెల్యేకు తమ మద్దతు తెలిపారు. మళ్లీ జగన్ సీఎం కావాలని.. ఎమ్మెల్యేగా శంకరరావు మల్లీ గెలవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో ప్రతి గ్రామంలో సచివాలయం, సీసీ రోడ్లు నిర్మించామన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు బాగు చేశామన్నారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనులు చేపడుతున్నామన్నారు. నిన్నటివరకు వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామని చెబుతున్నారన్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే.. జన్మభూమి కమిటీల అరాచకాలు మళ్లీ మొదలవుతాయని.. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీఎంగా ఐదేళ్లలో రాజధానిలో ఒక్క కంపెనీ తీసుకురాని చంద్రబాబు.. ఇప్పుడు పెదకూరపాడులో ఐటీ కంపెనీ తెస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన టీడీపిని ప్రజలే నిలదీయాలన్నారు. సీఎం జగన్ పాలనలో గత ఐదేళ్లలో అందిన సంక్షేమం, జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. తమకు మంచి జరిగిందని భావిస్తే.. మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Read Also: Tirumala: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదల చేసిన కాసేపట్లోనే..
వైఎస్సార్సీపీ వస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది: నంబూరు శంకరరావు
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకూరపాడు ఆయన అన్నారు. పెదకూరపాడు మండలం తమ్మవరంలో కూడా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పేదల పార్టీ అని.. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారన్నారు. అన్నదాతలకు భరోసా ఇచ్చారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. పాఠశాలలు బాగు చేసి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారన్నారు. తాను కూడా 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానన్నారు. అమరావతి – బెల్లంకొండ రోడ్డు, అమరావతి – తుళ్లూరు రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జి పూర్తి చేస్తున్నామన్నారు.
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆర్ధికంగా బలపడడానికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇస్తుంటే సోమరిపోతులను చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారన్నారు. ఒకప్పుడు వాలంటీర్లను దొంగలతో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటున్నారన్నారు. సీఎం జగన్ బాటలో నడుస్తూనే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి.. మంచి చేసిన వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని.. మరోసారి అవకాశమిస్తే రాష్ట్రానికి రోల్ మోడల్‌గా మార్చి మీ చేతుల్లో పెడతానని చెప్పారు. తాను చేసిన మంచిని చూసి తనకు అండగా నిలవాలని కోరారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. మళ్లీ జన్మభూమి కమిటీల అరాచకాలు మొదలవుతాయన్నారు. సంక్షేమ పాలన కావాలంటే ఒక ఓటు తనకు, మరో ఓటు ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.