Site icon NTV Telugu

Pawan Kalyan : అమరవీరులకు అంజలి

Pawan Kalyan Warns

Pawan Kalyan Warns

దేశం కోసం ప్రాణాలర్పించిన అసలైన దేశభక్తులు సర్దార్ భగత్ సింగ్, షాహిద్ రాజగురు, షాహిద్ సుఖదేవ్ లని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నేడు భగత్‌ సింగ్‌ వర్థంతిని పురస్కరించుకొని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. “దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు”.. అంటారు శ్రీ భగత్ సింగ్. స్వర్గీయ భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖదేవ్ థాపర్ విషయంలో ఈ పలుకులు అక్షర సత్యం అనిపిస్తాయి. మరణించి అమరులైనా నిరాకారంతో మన మధ్య జీవిస్తూనే ఉన్న వీరు చిరంజీవులు. సరిగ్గా ఇదే రోజున అంటే.. మార్చి 23, 1931న ఈ ముగ్గురు వీరులు దేశమాత దాస్యశృంఖలాలను తెంచడానికి లాహోర్ జైలులో ఉరి కంబాన్ని ముద్దాడారు. పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే ఈ ముగ్గురూ దేశంలో రగిలించిన స్వతంత్ర కాంక్ష, విప్లవాగ్ని పరాయి పాలకులు దేశం నుంచి పారిపోయేంత వరకు జ్వలిస్తూనే ఉన్నాయి.

Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా..? 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో భారీ కుదుపు

ఈ పుణ్య తిథి నాడు ఆ అమరవీరులకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఈ వీరుల బలిదానాలను స్మరించుకోడానికి ఏటా ఈ రోజున షహీద్ దివస్ (అమరుల సంస్మరణ) నిర్విహించుకుంటున్నాము. అయితే ఇది మాత్రమే సరిపోదని నా భావన. ఈ మహానీయులను నిత్యం స్మరించుకోవాలి. అందుకు తగిన విధంగా ఈ వీరుల విగ్రహాలను దేశవ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేయాలి. స్మారక స్తూపాలు నెలకొల్పాలి. వీరి చరితను చిరంతనంగా మన యువతకు అందించాలి. జాతిని నిత్యం జాగృతం చేయాలి. చివరిగా.. “నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలు చంపలేరు” అంటారు భగత్ సింగ్. నిజమే ఈ వీరుల ఆలోచనలు, భావ గాఢత దేశభక్తుల మదిలో పదిలంగా ఉన్నాయి. – జైహింద్’ అంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రకటనను విడుదల చేశారు.

Also Read : Arvind Kejriwal: రాహుల్ గాంధీని ఇలా కేసులో ఇరికించడం సరికాదు.

Exit mobile version