Pawan Kalyan: తన ఒంటిపై చేయి పడితే జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదన్నారు. తన ఒంటిపై రాయిపడితే తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. పాతిక సంవత్సరాల యుద్ధానికి సిద్ధపడి తనతో గొడవ పడాలన్నారు. వైసీపీ నేతలు వివిధ ప్రాంతాల నుంచి క్రిమినల్స్‌ను తీసుకొచ్చుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రోడ్డు మీద ఎలా తిరుగుతావో చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రౌడీలకు భయపడే రకం కాదు.. విప్లవకారుడినని పేర్కొన్నారు. మీరు రౌడీలను చూసి వుంటారు కానీ, విప్లవ పంథాలో వున్న రాజకీయ నాయకుడిని చూసి వుండరని వ్యాఖ్యానించారు. అంతర్వేదిలో రథం కాలిపోతే పిచ్చోడు చేశాడని అన్నారని .. అగ్ని క్షత్రియ కులానికి చెందిన ఓ వ్యక్తి 1800 ఎకరాలను లక్ష్మీనరసింహస్వామికి ఇచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఏపీలోనే అంతర్వేది పెద్ద రథమని దానిని వైసీపీ క్రిమినల్స్ కాల్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Pawan Kalyan: ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలను నిలదీయండి..
ముఖ్యమంత్రి జగన్‌పై ద్వేషం లేదు..
క్రిమినల్స్ అంటే తనకు భయం లేదని.. ముఖ్యమంత్రి జగన్‌పై ద్వేషం లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బెదిరింపులకు దిగితే విప్లపకారుడైన నాయకుడిని అవుతానన్నారు. దేవాలయాలపై 219 ఘటనలు జరిగితే ఒక్కరిని అరెస్టు చేయలేదని.. క్రిమినల్స్‌ను వదిలేస్తే మహిళల మానప్రాణాలకు రక్షణ ఎక్కడా అని పవన్ ప్రశ్నించారు. జనసేనకు అండగా నిలబడితే క్రిమినల్స్ ఆట కట్టిస్తామన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి చిక్కుకుపోయిన వారిని తిరిగి రప్పించడానికి చట్టాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాలను ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను గెలిస్తే అసెంబ్లీకి వెళ్ళి చట్టాలు అమలు చేయిస్తామన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఆందోళన చేస్తున్న దళితులకు తన మద్దతు ప్రకటించారు. ప్రధానమంత్రి దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లే వ్యక్తిని తానంటూ పవన్ పేర్కొన్నారు. సినిమా టికెట్లు విషయాన్ని ఎందుకు మా వద్దకు తీసుకురాలేదని కేంద్ర హోం మంత్రి అడిగారని.. అది నా సమస్య నేనే తేల్చుకుంటానని చెప్పానన్నారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా చూస్తామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించని వారు గెలవకూడదన్నారు. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి దోచేస్తున్నారని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే తిరుమల శ్రీవాణి ట్రస్టు అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.రాష్ట్రంలో దౌర్జన్యం చేస్తున్న వారిని వదిలిపెట్టనన్నారు.
హామీల వర్షం
అన్నవరం సత్యనారాయణ స్వామి, అంతర్వేది లక్ష్మినృసింహ స్వామి సాక్షిగా కోనసీమ రైల్వే లైన్, సఖినేటిపల్లి – చించునాడ వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల్లో 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాజోలు సముద్రతీర ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తయారు చేస్తామన్నారు. అన్నవరం నుండి జంగారెడ్డిగూడెం మద్ది ఆంజేనేయస్వామి ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీని రెట్టింపు చేయడానికి ప్రతి ఇంటికి 25 లక్షలు ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెడతామన్నారు. ఇన్సూరెన్స్ మొత్తం ప్రభుత్వం కట్టేలా అధికారంలోకి వస్తే చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గంలో 500 మంది కులాల దమాస ప్రకారం 10 లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడుపుతామన్నారు. వచ్చే ఎన్నికలలో గెలిపించాలని పవన్ అభ్యర్థించారు. సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని.. క్రిమినల్స్‌పై ధర్మయుద్ధం చేస్తానన్నారు. పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్ చేయాలని చూస్తే ఊరుకోమన్నారు.
విశ్వనరుడు అనే సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చా..
పార్టీని నడపటం చాలా కష్టసాధ్యమైన పని అన్నారు. వేల కోట్లు వున్నవాళ్లు కూడా పార్టీని నడపాలంటే భయపడతారని, ధైర్యవంతులైన 150 మందితో జనసేన పార్టీ ప్రారంభమైందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాలేదు, అన్ని కులాలను కలిపేందుకు వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ మందిని ఒప్పించినవారు రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గుర్రం జాషువా విశ్వనరుడు అనే సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చానని.. తొలుత తాను భారతీయుడినని, చివరగా తాను భారతీయుడిని అని చెప్పిన అంబేద్కర్ తనకు స్పూర్తి అన్నారు. జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు చేయటం నా బాధ్యత అని పవన్ స్పష్టం చేశారు.
అలా చేస్తే ప్రజలు సహించరు..
జనసేన తరపున ప్రతి నియోజకవర్గంలో పోటీకి నలుగురు ముందుకు వస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మా ఓటుతో గెలిచి వేరొక పార్టీలోకి పోతే ప్రజలు సహించరని మండిపడ్డారు. తన ఎదురుగా వున్నవాళ్లంతా ప్రేమతో వచ్చినవాళ్లే.. డబ్బు కోసం వచ్చినవాళ్లు కాదన్నారు. గోదావరిలా తాను ఈ నేలను అంటి పెట్టుకుని వుంటానిన పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బటన్ నొక్కితే రూ.10 వేలు పడుతున్నాయని.. కానీ అందరికి సమానంగా పంచడం లేదన్నారు. అనేక వస్తువుల మీద జీఎస్టీ చెల్లించి మనమే ప్రభుత్వ ఖజానా నింపుతున్నామని, ఆ డబ్బును అందరికీ సమానంగా పంచాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.