Pawan Kalyan Delhi Comments: ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన ‘సేన ప్రస్థానం–జాతీయ సమైక్యత కోసం’ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తమ లక్ష్యం అధికారం లేదా పదవులు కాదని.. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. 2014లో జనసేన పార్టీని ప్రారంభించింది అధికారం కోసం కాదని, దేశానికి సేవ చేయాలనే ఆలోచనతోనే ముందుకు వచ్చామని చెప్పారు. దేశ సమగ్రతకు ముప్పు కలిగించే శక్తులను ఎప్పటికీ సహించబోమని, జాతి ప్రయోజనాల విషయంలో జనసేన ఎప్పుడూ రాజీపడదని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ భావజాలం బలపడుతోందని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది జనసేన కోసం పని చేయడానికి ముందుకు వస్తున్నారని పవన్ అన్నారు.
తెలంగాణ ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ రాష్ట్ర విభజన చేసిన విధానాన్ని మాత్రమే ప్రశ్నించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ విభజనను నిర్వహించిన తీరు కారణంగానే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందని పవన్ తెలిపారు. త్యాగాలకు ప్రతీక, పాలనకు కేంద్రబిందువు, రాజ్యాంగ విలువలకు ప్రతిబింబం ఢిల్లీ అని పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రక నగరంలో దేశ సమగ్రత కోసం సమావేశం నిర్వహించడం ద్వారా జనసేన దేశభక్తికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలియజేయాలనుకున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.
దేశ సమైక్యతకు విఘాతం కలిగించే ఎవరినైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘చలి చీమలు కూడా పామును చంపేస్తాయి’ అన్న సామెతను ప్రస్తావిస్తూ.. మంచి అయినా చెడు అయినా దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. విభజనవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై జనసేన గళం బలంగా వినిపిస్తుందని తెలిపారు. అలాగే ఢిల్లీకి తాము ఎప్పుడూ అధికారాల కోసం, పదవుల కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం రాలేదన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సమగ్రత కోసం మాత్రమే ఢిల్లీ బాట పడతామని స్పష్టం చేశారు. జనసేన ఎంపీలు కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో గళం వినిపించాలని ఆయన సూచించారు.
కొన్ని రాజకీయ పార్టీలు స్వలాభం కోసం దేశ సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వలేదని గుర్తు చేస్తూ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉండి ఢిల్లీపై తీవ్ర విమర్శలు చేసే నాయకులు, రాజధానికి వచ్చాక మాత్రం మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీలో మెడలు వంచుతామని చెప్పేవారి నోళ్లు, ఢిల్లీకి వచ్చాక ఎందుకు పెగలడం లేదు?’ అంటూ ప్రశ్నించారు. దేశ శ్రేయస్సు, జాతీయ సమగ్రత, ప్రజల సంక్షేమమే జనసేన పార్టీ ప్రధాన ఎజెండా అని పవన్ పునరుద్ఘాటించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా జనసేన జాతీయ రాజకీయాల్లో తన భావజాలాన్ని మరింత బలంగా చాటిచెప్పిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

