Pawan Kalyan Political Strategy: రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ పెంచారు. ఈ నేపథ్యంలో ఇటీవలే పార్టీ నిర్మాణ బాధ్యతలను రామ్ తాళ్లూరికి అప్పగించారు. లోకల్ బాడీల ఎన్నికలను టార్గెట్ చేస్తూ జనసేన వ్యూహాలను వేగంగా అమలు చేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ విభాగాల వారీగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ సంస్థాగతంగా పార్టీని రీబిల్డ్ చేసే పనిలో పార్టీ నిమగ్నమైంది. తెలంగాణలో పూర్తిస్థాయి నాయకత్వ మార్పు దిశగా చర్చలు జరుగుతున్నాయి. కొత్త లీడర్షిప్‌ను ప్రవేశపెట్టి, రూరల్ నుంచి అర్బన్ వరకూ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌ను రీడిజైన్ చేస్తున్నారు పార్టీ నేతలు.
ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి రాని జనసేన.. ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో, స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు ప్రత్యక్షంగా పోటీ చేస్తూ ప్రభావాన్ని చూపే పార్టీగా మారాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఏపీలో సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ మాదిరిగానే.. తెలంగాణలో కూడా పార్టీ బలం పెరగాలని పవన్ భావిస్తున్నారు. ప్రత్యక్ష పోటీలో ఉంటేనే కేడర్ యాక్టివ్ అవుతారని, గ్రౌండ్ లెవల్‌లో జనసేన ఎదుగుతుందని పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త నాయకత్వం ఎంపిక, గ్రాస్ రూట్ బలోపేతం, యువతను ఆకర్షించే చర్యలు వరసగా చేపడుతున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కార్యక్రమాలు అదే వేగంతో సాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా సమావేశాలు, సమీక్షలు జరుపుతూ.. లోకల్ బాడీల ఎన్నికల ముందు పార్టీ బలం పెంచే పనిలో జనసేన దూకుడు పెంచింది. రెండు రాష్ట్రాల్లోనూ గ్రాస్‌రూట్ కేడర్ మొబిలైజేషన్, కీలక నేతలతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ నిర్మాణం, ఆర్గనైజేషనల్ రీవ్యూ, ఫీల్డ్ రిపోర్టులు, స్ట్రాటజీ చర్చలు అన్ని రామ్ తాళ్లూరి నేతృత్వంలో మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచే నడుస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉన్న జనసైనికులు, స్థానిక నాయకులతో సమావేశమై అక్కడి గ్రౌండ్ లో పరిస్థితులు, బలోపేతం చర్యలు, కేడర్ మొబిలైజేషన్‌పై సమగ్ర చర్చలు చేస్తున్నారు. అదే సమయంలో, స్థానికంగా మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీతో ఎలాంటి విభేదాలు లేకుండా.. కూటమి స్ఫూర్తికి భంగం కలగకుండా.. జనసేన తన బలాన్ని పెంచే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది. బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టం కావడం పార్టీ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి జనసేన స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుని ముందుకు సాగుతుంది..