NTV Telugu Site icon

Pawan Kalyan: టీడీపీ వెనుక జనసేన వెళ్లటం లేదు..

Janasena

Janasena

Pawan Kalyan: గత ఎన్నికలలో గెలుస్తామో లేదో తెలియదు కానీ బరిలో నిలబడాలి అని నిర్ణయించి పోటీకి దిగానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సారి పరిస్థితి అలా ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. జగన్ మహాత్ముడు అయితే మనం ఒంటరిగా పోటీ చేయవచ్చని.. కానీ జగన్ ప్రజా కంటకుడు అని విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ నుంచి కొందరు వైసీపీకి వెళ్లి నన్ను విమర్శిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో సర్కారును స్థాపించడం పక్కా అని అన్నారు. దశాబ్దం ఆగి తెలంగాణలో పోటీ చేశానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ వెనుక జనసేన వెళ్లటం లేదన్న పవన్‌.. టీడీపీతో కలిసి జన సేన నడుస్తోందన్నారు. వైసీపీని తక్కువ చేయనని.. జగన్ విధానం వల్ల ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

Read Also: Pawan Kalyan: ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తుపై పవన్ క్లారిటీ

ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దన్నారు. నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవని పవన్ కళ్యాణ్‌ పేర్కొన్నారు. నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారని.. కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆలోచన చేసే వారు వైసీపీలోకి వెళ్లి పోవచ్చన్నారు. టీడీపీ జనసేన పొత్తుపై విమర్శలు చేసే వారని వైసీపీ కోవర్టులుగా పరిగణిస్తామన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఆయన తెలిపారు. జరగబోయేది కురుక్షేత్రం అంటున్న జగన్‌కి ఎవరు అర్జునుడు, ఎవరు కృష్ణుడో త్వరలో తెలుస్తుందన్నారు.

కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకు అండగా ఉంటారని పవన్‌ తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల నుంచి నియోజక వర్గ ఇంఛార్జిలు కీలక నేతలతో ఇంటరాక్షన్ అవుతానన్న పవన్‌.. జగన్ పదేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండేలా పనిచేయాలన్నారు. ప్రతి రోజు హాఫ్ పర్సెంట్ వైసీపీ ఓటింగ్ తగ్గేలా పని చేయాలన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.